: వడ్డీలు తగ్గలేదు... ఊరట లేదు... మారని పరపతి విధానం
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కీలక వడ్డీ రేట్లను తగ్గించడానికి ఆసక్తి చూపలేదు. గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం పరపతి సమీక్ష మంగళవారం ఉదయం ముంబైలో జరుగగా, వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణ కట్టడికే కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఆర్‌బిఐ గవర్నర్ రఘురాం రాజన్ వివరించారు. జనవరి 2016 నాటికి టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 6 శాతానికి దిగువన ఉండేలా చూడటమే తమ లక్ష్యమని ఆయన అన్నారు. మరికొంత కాలం పాటు రెపో రేటు 7.5 శాతం వద్ద, సీఆర్ఆర్ 4 శాతం వద్ద కొనసాగుతాయని వివరించారు. భవిష్యత్తులో అవకాశం లభిస్తే వీటిని తగ్గిస్తామని తెలిపారు. కాగా, ఆర్‌బిఐ పరపతి సమీక్ష అనంతరం వడ్డీ రేట్లు తగ్గి మరికాస్త ఊరట లభిస్తుందని భావించిన వారికి నిరాశే మిగిలింది.