: గురి హస్తినపై...ఆశ్రయం కోసం తెలుగు రాష్ట్రాలకు!: సూర్యాపేట షూటర్స్ కేసులో కొత్త కోణం
దేశ రాజధాని ఢిల్లీలో అల్లకల్లోలం సృష్టించడమే లక్ష్యంగా రంగంలోకి దిగిన సిమీ ఉగ్రవాదులు, ఆశ్రయం కోసమే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించారట. ఈ క్రమంలోనే ఈ నెల 1న నల్గొండ జిల్లా సూర్యాపేట హైటెక్ బస్టాండ్ లో తమను పట్టుకునేందుకు వచ్చిన పోలీసులపై వారు కాల్పులకు దిగి సూర్యాపేట షూటర్స్ గా కొత్త అవతారం ఎత్తారు. ఢిల్లీలో దాడికి ముందు ఏపీలోని విజయవాడలో భారీ దోపిడీకి పథకం వేశారు. అందుకోసమే బెజవాడ వెళుతున్న క్రమంలో తమను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులపై వారు కాల్పులకు దిగారు. ఢిల్లీలో దాడుల కోసం సాధన సంపత్తిని సమీకరించేందుకే, వారు తెలుగు రాష్ట్రాలకు వచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు జానకీపురం వద్ద ఎన్ కౌంటర్ లో మరణించిన ఉగ్రవాదుల వద్ద లభించిన రైలు, బస్సు టికెట్లు పోలీసుల అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. అంతేకాక ఇటీవల హైదరాబాదులో ఈ మేరకు పోలీసులకు ప్రాథమిక ఆధారాలు లభించాయి.