: ఎయిర్ ఇండియా విమానం కాక్ పిట్ లో ఫైట్... కొట్టుకున్న పైలట్, కో-పైలట్
ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం కాక్ పిట్ లో నిన్న పైలట్లు కొట్టుకున్నారు. పైలట్ పై అసభ్యపదజాలంతో కో-పైలట్ విరుచుకుపడటం, ఆ తర్వాత వారిద్దరూ ఘర్షణ పడటం కలకలం రేపుతోంది. విమానంలో కొన్ని వివరాలను నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిన పైలట్ పై కో-పైలట్ అకారణంగా తిట్ల దండకం అందుకున్నాడు. అంతేకాక పైలట్ పై అతడు దాడి కూడా చేశాడని ఎయిర్ లైన్స్ వర్గాలు వెల్లడించాయి. నిన్న జైపూర్ నుంచి న్యూఢిల్లీ బయలుదేరిన విమానంలో ఈ ఘర్షణ చోటుచేసుకుంది. జైపూర్ లో విమానం టేకాఫ్ కాగానే ఈ ఘర్షణ చోటుచేసుకోగా, కాస్త ఓపిక పట్టిన పైలట్ విమానాన్ని కిందకు దించకుండా ఢిల్లీ చేర్చాడు. అనంతరం ఎయిర్ ఇండియా ఉన్నతాధికారులకు అతడు కో-పైలట్ నిర్వాకంపై ఫిర్యాదు చేశాడు. అయితే పైలట్, కో-పైలట్ల మధ్య వాగ్వాదం మాత్రమే చోటుచేసుకుందన్న ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి, అంతకుమించి ఏ జరగలేదని చెప్పుకొచ్చారు. సంస్థ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పైలట్ బయట నోరువిప్పడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే, తమ ప్రాణాలతో చెలగాటమాడిన పైలట్ల వ్యవహార శైలిపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.