: చావుబతుకుల్లో ఎస్సై సిద్ధయ్య... మగబిడ్డకు జన్మనిచ్చిన ఆయన భార్య!
నల్గొండ జిల్లా జానకీపురం ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదులకు ఎదురొడ్డి పోరాడిన ఎస్సై సిద్ధయ్య చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాదులోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిన్న ఆయనకు శస్త్ర చికిత్స జరుగుతున్న సమయంలోనే ఆయన భార్య అదే ఆస్పత్రిలోని ప్రసూతి వార్డులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగానే ఉన్నారని వైద్యులు ప్రకటించారు. అయితే శరీరంలో నాలుగు బుల్లెట్లతో ఆస్పత్రికి వచ్చిన సిద్ధయ్యకు పది గంటల పాటు శస్త్రచికిత్స చేసిన వైద్యులు, మూడు బుల్లెట్లను బయటకు తీశారు. అయితే మెదడులో ఉన్న నాలుగో బుల్లెట్ ను తీసేందుకు సాధ్యం కావడం లేదు. సదరు బుల్లెట్ ను తీస్తే, సిద్ధయ్య ప్రాణానికే ప్రమాదమని భావిస్తున్న వైద్యులు మరికొంతకాలం వేచి చూడాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తన రక్తం పంచుకుపుట్టిన బిడ్డను చూసుకోలేని, అసలు ఈ విషయం తెలుసుకోలేని స్థితిలో సిద్ధయ్య ఆస్పత్రి బెడ్ పై ప్రాణాలతో పోరాడుతుండటం అటు పోలీసు కుటుంబాలనే కాక యావత్తు తెలుగు ప్రజలను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది.