: బయటకు చెబితే మరింత బాధ... కార్యాలయాల్లో లైంగిక వేధింపులపై ఉద్యోగినుల వ్యధ!
నిహారికా త్యాగి... ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగిని. తనకు ఎదురైన లైంగిక వేధింపులను 9 నెలల పాటు మౌనంగా భరించి, ఆపై తాళలేక ఫిర్యాదు చేసింది. సమస్య పరిష్కారం కాకపోగా, ఆమె పనిచేస్తున్న డిపార్ట్ మెంట్ హెడ్ నుంచి నోటీసులు అందుకుంది. ఆఫీసులోకి ప్రవేశించగానే "నీ ఫిర్యాదు వెనక్కి తీసుకో. అతని గురించి ఆలోచించు. ఆయనకు పెళ్లాం, పిల్లలు ఉన్నారు" అంటూ సదరు ఉన్నతాధికారి కేకలు వేశారు. త్యాగి మాత్రం వెనక్కు తగ్గలేదు. చివరికి ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలగించారు. అయితే సమస్య అక్కడితో ఆగిపోలేదు. "నేను ఫిర్యాదు చేసిన మరుక్షణం నుంచి నా బాధ పెరిగింది. నాపై సహోద్యోగులు జోకులు వేసుకునేవారు. 'ఈ ఆధునిక మహిళను చూడండి. ఎవరైనా భుజంపై చెయ్యి వేసినా లైంగిక వేధింపులు అంటూ ఏడుపు మొదలుపెడుతుంది' అంటూ మాట్లాడుకునేవారు. అందరి జోకులకు నేను కేంద్రాన్ని అయ్యాను" అని త్యాగి తెలిపారు. ఇక డిపార్ట్ మెంట్ హెడ్ ఆమెకు పని ఇవ్వడం తగ్గించి, ఆపై ఇచ్చిన పని సరిగా చేయడం లేదని కేకలు వేయడం మొదలు పెట్టాడట. ఆఫీసులో ఒంటరైన ఆమె చివరికి రాజీనామా చేసింది. కార్యాలయాల్లో లైంగిక వేధింపుల విషయంలో ఇది ఒక కోణం మాత్రమే. ఒక ఫిర్యాదు చేసిన తరువాత భవిష్యత్తులో అటువంటి వేధింపులు ఉండవని యాజమాన్యాలు హామీ ఇవ్వగలుగుతున్నాయా? అంటే సమాధానం దొరకట్లేదు. అమలులో ఉన్న చట్టాల ప్రకారం బాధిత మహిళ వివరాలు బయట పెట్టకూడదు. కానీ చాలా సందర్భాల్లో అలా జరగట్లేదు. సదరు మహిళ మరో ఉద్యోగం వెతుక్కోవడంలో కూడా కష్టాలు ఎదురవుతున్నాయి. ఇది ఇలా ఉంటే, బాధితురాలికి స్నేహితుల నుంచి వచ్చినంత ఓదార్పు కూడా కుటుంబ సభ్యుల నుంచి లభించడం లేదు. ఫిర్యాదు చేసిన వారిలో 99 శాతం మంది ఉద్యోగాలు వీడాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా సందర్భాల్లో నిందితుడు బాధితురాలికన్నా పెద్ద పొజిషన్ లో ఉండటంతో, సహోద్యోగుల సలహా సైతం రాజీనామా చేయమనే వస్తోంది. చాలా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని రక్షించేందుకు అంతర్గతంగా యత్నాలు జరుగుతున్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. దీనికి ఉదాహరణ తెహల్కా కేసు. మీడియాలో వివరాలు వచ్చిన తరువాతనే తెహల్కా చీఫ్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. మహిళలపై లైంగిక వేధింపులు ఆగాలంటే మరింత కఠిన చట్టాలు అమలు కావాలని సామాజిక ఉద్యమ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.