: ‘ఒకే ఒక్కడు’ గా దేవేంద్ర ఫడ్నవీస్... అవినీతి ఐఏఎస్ ను ఏసీబీకి పట్టించిన వైనం!
తమిళ సినీ స్టార్ అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘ఒకే ఒక్కడు’ చిత్రం చూశారుగా. సినిమాలో విలేకరి అయిన హీరో సీఎం అవుతాడు. సీఎం హోదాలో స్వయంగా రంగంలోకి దిగి అవినీతి అధికారుల భరతం పడతాడు. అచ్చం ఆ సినిమాలోలాగానే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అవినీతి అధికారి భరతం పట్టారు. ఉద్యోగం పేరిట లక్షల మేర లంచాలు తీసుకుంటున్న ఐఏఎస్ అధికారిని ఫడ్నవీస్ ఏసీబీ అధికారులకు పట్టించారు. వివరాల్లోకెళితే... మహారాష్ట్ర సచివాలయం ‘మంత్రాలయ’లో న్యాయ శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న మిలిండ్ కదమ్, ఆ శాఖ పరిధిలోని నోటరీ పోస్ట్ ఇవ్వడానికి ఓ నిరుద్యోగి వద్ద లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు నేరుగా ఫడ్నవీస్ కు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన ఫడ్నవీస్, నేరుగా ఏసీబీ అధికారులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో పాటు తక్షణమే వలపన్ని పట్టేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఫడ్నవీస్ ఆదేశాలతో ఆగమేఘాలపై కార్యరంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బాధితుడి ద్వారా మిలింద్ కు రూ.4 లక్షలు ఇప్పించి, అవినీతి ఐఏఎస్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇక్కడ మరో విశేషమేంటంటే, సదరు రూ.4 లక్షలను ఫడ్నవీస్ మరో మంత్రితో కలిసి ఏసీబీ అధికారులకు సర్దారట.