: మొసలి బారిన పడ్డ కూతుర్ని రక్షించుకున్న తల్లి!
మొసలి నోట చిక్కిన కన్న బిడ్డను రక్షించుకునేందుకు ఓ మహిళ అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించింది. ఈ ఘటన గుజరాత్ లోని వడోదర సమీపంలోని విశ్వామిత్ర నదీ తీరంలో జరిగింది. నదిలో బట్టలు ఉతుక్కునేందుకు కంతా వాంకర్ (19) అనే యువతి వచ్చింది. అంతలో నదిలోని మొసలి ఆమె కాలును నోట కరచి అమాంతం నదిలోకి లాగింది. ఆ దృశ్యాన్ని చూసిన యువతి తల్లి దీపాలి, బట్టలు ఉతికే బ్యాట్ తో మొసలి తలపై దాదాపు 10 నిమిషాలు ఏకధాటిగా కొడుతూ నిలిచింది. కాసేపటికి ఆ మొసలి యువతి కాలును వదిలిపెట్టి నదిలోకి వెళ్ళిపోయింది. కాగా, విశ్వామిత్ర నదిలో దాదాపు 260 మొసళ్లు ఉన్నట్లు అటవీ శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. నదీ పరివాహక ప్రాంతంలో బట్టలు ఉతకవద్దని గ్రామస్తులకు హెచ్చరికలు జారీ చేసినా ప్రయోజనం లేకపోతోందని తెలిపారు. మొసలి బారినపడి గాయపడ్డ యువతికి ప్రాణాపాయం లేదని వైద్యులు వివరించారు.