: ‘సూర్యాపేట’ షూటర్స్ పేర్లు అక్రమ్ అయూబ్, జకీర్ బద్రూన్... ఘటనాస్థలికి క్యూ కట్టిన పోలీసు బాసులు
నల్గొండ జిల్లా పోలీసులకు ముచ్చెమటలు పట్టించడంతో పాటు నలుగురు పోలీసులను పొట్టనబెట్టుకుని ‘సూర్యాపేట షూటర్స్’ గా పేరుగాంచిన దోపిడీ దొంగల పేర్లు వెల్లడయ్యాయి. మూడు రోజుల పాటు ఒక్క నల్గొండ జిల్లానే కాక యావత్తు తెలుగు రాష్ట్రాలను వణికించిన సదరు షూటర్లను అక్రమ్ అయూబ్, జకీర్ బద్రూన్ లుగా పోలీసులు నిర్ధారించారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వీరిని నల్గొండ జిల్లా మోత్కుపల్లి మండలం జానకీపురంలో నేటి ఉదయం పోలీసులు కాల్చి చంపారు. ఉదయం దాదాపు మూడు గంటల పాటు సినీ ఫక్కీలో వీరిని ఛేజ్ చేసిన పోలీసులు, ఎట్టకేలకు మట్టుబెట్టగలిగారు. ఇదిలా ఉంటే, ఎన్ కౌంటర్ పూర్తైన మరుక్షణమే జిల్లా ఎస్పీ ప్రభాకరరావు ఘటనా స్థలానికి చేరుకుని షూటర్ల మృతదేహాలను పరిశీలించారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ కూడా ఘటనాస్థలాన్ని సందర్శించారు.