: మ్యాచ్ ఫిక్స్ చేసింది మా అమ్మే: రైనా
టీమిండియా క్రికెటర్ సురేశ్ రైనా పెళ్లి నేడేనన్న సంగతి తెలిసిందే. ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లో రైనా తన తల్లి స్నేహితురాలి కుమార్తె ప్రియాంక చౌదరి చేయందుకోనున్నాడు. రైనా పెళ్లికి విషెస్ చెప్పేందుకు అతని మిత్రుడు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశాడు. అందులో రైనా మాట్లాడుతూ, ఈ మ్యాచ్ ఫిక్స్ (పెళ్లి కుదిర్చింది) చేసింది తన తల్లేనని చెప్పుకొచ్చాడు. గత ఐదు నెలలుగా ఆస్ట్రేలియాలోనే ఉన్నానని, అప్పుడే అమ్మ ఫోన్ చేసి పెళ్లి ఫిక్స్ చేసినట్టు తెలిపిందని వివరించాడు. ఆ తర్వాత తాను ప్రియాంకకు ఫోన్ చేసి మాట్లాడినట్టు తెలిపాడు. ప్రియాంక తాను బాల్య మిత్రులమే అయినా, ఎప్పుడోగానీ కలిసేవారం కాదని తెలిపాడు. 2008లో ఓ ఎయిర్ పోర్టులో ఐదు నిమిషాల పాటు మాట్లాడానని గుర్తుచేసుకున్నాడు. అప్పుడామె ఉద్యోగం కోసం హాలెండ్ వెళుతోందని, తాను ఐపీఎల్ మ్యాచ్ కోసం బెంగళూరు వెళుతున్నానని తెలిపాడు. ప్రియాంక తండ్రి ఘజియాబాద్ స్కూల్లో తన స్పోర్ట్స్ టీచర్ అని, ఆమె తల్లి తన తల్లికి సన్నిహితురాలని వివరించాడు.