: వేతనాలను పెంచేసుకున్న కర్ణాటక ఎమ్మెల్యేలు... బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
ప్రజా సేవ విషయంలో పోట్లాడుకునే చట్టసభల సభ్యులు తమ వేతనాలు, అలవెన్సులను పెంచుకునే విషయంలో మాత్రం ఒక్కతాటిపై నిలుస్తున్నారు. మొన్న తెలంగాణ, నిన్న ఏపీ... తాజాగా కర్ణాటక ఎమ్మెల్యేలు తమ వేతనాల పెంపునకు ప్రతిపాదించిన బిల్లును క్షణాల్లో ఆమోదించుకున్నారు. నెలకు రూ.20 వేలుగా ఉన్న తమ వేతనాన్ని రూ.25 వేలకు మాత్రమే పెంచుకుంటున్నామని బిల్లులో పేర్కొన్నప్పటికీ, సదరు బిల్లు పూర్తి పాఠం చూస్తే షాక్ కొడుతుంది. ఎందుకంటే వివిధ అలవెన్సుల్లో సవరణలంటూ ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు కనీసం రూ.50 వేలు అదనంగా అందేలా చూసుకున్నారు. ఈ బిల్లుకు నిన్న కర్ణాటక అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం ప్రతి ఎమ్మెల్యేకు ప్రస్తుతం నెలకు అందే రూ.90 వేలకు బదులుగా రూ.1.4 లక్షలు అందనున్నాయి.