: బీసీసీఐ, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య బిగ్ ఫైట్!
మరో వారంలో ఐపీఎల్ టోర్నీ క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించనుంది. ఇప్పటికే ఆయా జట్లు సర్వసన్నద్ధమయ్యాయి. అయితే తన మాట నెగ్గని పక్షంలో బరి నుంచి తప్పుకునేందుకు వెనుకాడేది లేదంటూ డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ బాంబు పేల్చింది. వెస్టిండీస్ మిస్టరీ బౌలర్ సునీల్ నరైన్ ను కొనుగోలు చేసిన కోల్ కతా నైట్ రైడర్స్, అతడిని ఆడించేందుకు అనుమతించకుంటే టోర్నీ నుంచి తప్పుకుంటానని చెబుతోంది. బౌలింగ్ లో వివాదాస్పద యాక్షన్ నేపథ్యంలో నరైన్ పై ఐసీసీ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే నిబంధనలకు అనుగుణంగా తన యాక్షన్ ను మార్చుకున్న నరైన్ పై నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో నరైన్ ను ఆడించే విషయంలో బీసీసీఐ అభ్యంతరం చెబుతోంది. మరోసారి అతడు పరీక్షలకు హాజరుకావాల్సిందేనని చెబుతోంది. దీంతో నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం ప్రతినిధి, బీసీసీఐ చీఫ్ జగ్ మోహన్ దాల్మియాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నరైన్ అంశాన్ని ప్రస్తావించిన కోల్ కతా నైట్ రైడర్స్ ప్రతినిధి, నరైన్ ను అనుమతించాల్సిందేనని డిమాండ్ చేశారట.