: వాయువేగం... 33 నిమిషాల్లో 10 కిలో మీటర్ల పరుగు పూర్తి చేసిన రాజస్థాన్ యువకుడు!


అదేం ఒలింపిక్ పరుగు పోటీ కాదు. జాతీయ క్రీడల్లో రన్నింగ్ కేసు అంతకంటే కాదు. అయినా జాతీయ స్థాయిలో నమోదైన పలు రికార్డులను బద్దలు కొట్టేస్తాడేమోనన్న రీతిలో రాజస్థాన్ కు చెందిన సందీప్ ఆచార్య వాయువేగంతో పది కిలో మీటర్ల దూరాన్ని కేవలం 33 నిమిషాల్లో పూర్తి చేశాడు. అయినా అతడు అంతదూరాన్ని ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయాల్సిన అవసరం ఏమిటంటే, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం కోసమట. రాజస్థాన్ లోని హనుమాన్ గఢ్ జిల్లా కిహన్ పురా ఉత్తరాడలో కూలీగా జీవనం సాగిస్తున్న ఈ 24 ఏళ్ల యువకుడు, శ్రీగంగానగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 26న జరిగిన పోలీస్ రిక్రూట్ మెంట్ కు హాజరయ్యాడు. దేహ దారుఢ్య పరీక్షలో భాగంగా నిర్వహించిన 10 కిలో మీటర్ల పరుగును అభ్యర్థులు గంట సమయంలో పూర్తి చేయాల్సి ఉంది. పరుగు ప్రారంభం కాగానే వాయువేగంతో దూసుకుపోతున్న సందీప్ ఆచార్య ను చూసి పోలీసు అధికారులు నోరెళ్లబెట్టారట. ఇదిలా ఉంటే, సింథటిక్ ట్రాక్ పై నిర్దేశిత ప్రమాణాలు కలిగిన బూట్లతో 10 కిలో మీటర్ల దూరాన్ని 28 నిమిషాల 2 సెకన్లలో పూర్తి చేసిన రికార్డు సురేంద్ర సింగ్ అనే వ్యక్తి పేరిట ఉండగా, సాధారణ రోడ్ పై ఈ దూరాన్ని 29.43 సెకన్లలో పూర్తి చేసిన జాతీయ రికార్డు కాశీనాథ్ అశ్వాలే పేరిట ఉంది. అయితే సందీప్ ఆచార్య పరుగులో ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా? అన్న దిశగా పోలీసులు విచారిస్తున్నారు. సరైన బూట్లు, సరైన ట్రాక్ ఉంటే... ఈ రెండు రికార్డులను సందీప్ బద్దలు కొట్టేస్తాడని పోలీసులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News