: ధోనీ వ్యాఖ్యలతో ఏకీభవించిన క్లార్క్
టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ వ్యాఖ్యలతో ఆస్ట్రేలియా వన్డే జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ ఏకీభవించాడు. సెమీఫైనల్ మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఓటమి అనంతరం ధోనీ మాట్లాడుతూ, సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్ల నిబంధన సరికాదని చెప్పాడు. దీని వల్ల క్రికెట్ బ్యాట్స్ మెన్ క్రీడగా మారిపోతుందని, బౌలర్ల ఉనికి లేకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై క్లార్క్ మాట్లాడుతూ, 30 యార్డ్ సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు ఉంటే ప్రయోజనం ఉంటుందని అన్నాడు. దీని వల్ల బౌలర్లు, బ్యాట్స్ మెన్ మధ్య ఆసక్తికర పోరు జరుగుతుందని, వీక్షకులు ఆటను ఆస్వాదిస్తారని క్లార్క్ అభిప్రాయపడ్డాడు. సర్కిల్ బయట ఐదుగుర్ని పెడితే స్పిన్నర్లు లబ్ధి పొందుతారని, పరుగుల ప్రవాహం తగ్గుతుందని క్లార్క్ స్పష్టం చేశాడు.