: మదర్ థెరెసాకు 18 ఏళ్లున్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్
ఆమెదొక దేవదూతల ముఖారవిందం... ప్రకాశవంతమైన రంగు, పరిపూర్ణ నవ్వు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటాయి. ఈ లక్షణాలన్నీ ఒక్క మదర్ థెరెసాకే సొంతం. కాగా, అత్యధికులకు తెలిసింది వృద్ధ థెరెసానే. కానీ, ఆమె వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటారనేది ఎవరికీ తెలియదు. థెరెసా యవ్వనంలో ఉన్నప్పటి ఫోటో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె 18 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పటి ఫోటో అదని అందులో చెబుతున్నారు. ఎంతో స్పష్టంగా, సాధారణంగా కనిపిస్తున్న ఆ ఫోటోలో ఉన్న థెరెసాయేనా నన్ గా మారి, ఎంతోమందికి సేవ చేసిందని ముక్కున వేలేసుకోకమానరు. నిరాశ్రయులు, క్షయవ్యాధి పీడితులు, కుష్టు రోగులు మొదలగువారి సంక్షేమం, పునరావాసం కోసం భారత్ లో 1950లో రోమన్ క్యాథలిక్ సంస్థను థెరెసా స్థాపించారు. తరువాత కాలంలో 133 దేశాల్లో 4500 మంది సేవికలతో ఈ సంస్థ తరపున మిషనరీలను నెలకొల్పి సేవ చేశారు. ఆమె అనితరసాధ్యమైన సేవలకు గుర్తింపుగా 1979లో నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. 1997 సెప్టెంబర్ 5న మదర్ తుదిశ్వాస విడిచారు.