: నా కేసు ఏమైంది...?: కర్ణాటక ఖాకీలకు సహ చట్టంతో షాకిచ్చిన ‘గోకుల్ చాట్’ ఉగ్రవాది


సమాచార హక్కు చట్టం పనిచేయని అధికారుల పనిబడుతోంది. ఈ చట్టంతో సామాజిక ఉద్యమకారులు కేంద్ర, రాష్ట్రాల అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తాజాగా కర్ణాటక పోలీసులకు ఓ ఉగ్రవాది ఇదే చట్టాన్ని అస్త్రంగా చేసుకుని షాకిచ్చాడు. అసలు తన కేసు దర్యాప్తు ఎంతవరకొచ్చిందో తెలపాలంటూ అతడు దాదాపుగా హుకుం జారీ చేసినంత పనిచేశాడు. వివరాల్లోకెళితే... పుణేకు చెందిన మెకానికల్ ఇంజినీర్ మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ ఛౌదురీ ఇండియన్ ముజాహిదీన్ పట్ల ఆకర్షితుడై ఉగ్రవాదిగా మారాడు. మెకానికల్ ఇంజినీర్ గా జీవనం సాగిస్తున్న ఇతడు పుణే, ముంబై తదితర ప్రాంతాల్లో పేలుడు పదార్థాలు రవాణా చేస్తూ ముంబై పోలీసులకు పట్టుబడ్డాడు. దర్యాప్తులో భాగంగా హైదరాబాదులోని లుంబినీ పార్కు, గోకుల్ చాట్ బాంబు పేలుళ్లలోనూ ఇతడి ప్రమేయం ఉందని తేలింది. కోర్టు విధించిన రిమాండ్ ప్రకారం అతడిని ముంబైలోని అర్థర్ రోడ్ జైలుకు పోలీసులు తరలించారు. ప్రస్తుతం అతడు అక్కడే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే, కర్ణాటకలోని మంగళూరులోని ఉల్లాల్ పోలీస్ స్టేషన్ లోనూ ఇతడిపై ఓ కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత అతడు ముంబైలో అరెస్టవడంతో విచారణపై దృష్టి సారించలేదు. దీంతో తనపై నమోదైన కేసు దర్యాప్తు ఎంతవరకొచ్చిందో తెలపాలంటూ తాజాగా అతడు కర్ణాటక సమాచార కమిషన్ కార్యాలయంలో పిటిషన్ దాఖలు చేశాడు. ఇతడి పిటిషన్ ను విచారించిన కమీషన్, 30 రోజుల్లోగా అక్బర్ కు సమాచారం అందించాల్సిందేనని ఉల్లాల్ పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News