: బ్రిటీషర్లను తలపించే విధంగా టీఆర్ఎస్ పాలన!: బీజేపీ ఎమ్మెల్యే చింతల
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చుతామని టీఆర్ఎస్ ప్రగల్భాలు పలుకుతోందని, కానీ వారి పాలన మాత్రం బ్రిటీషర్లు, నిజాంలను తలపిస్తోందని విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వ అక్రమాలపై ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలను హింసిస్తున్నారని, లేదంటే అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. ఇందుకు నిదర్శనం తమ పార్టీ నేత రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేయడమేనని చింతల చెప్పారు. బాన్సువాడలో మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అక్రమంగా నిర్మిస్తున్న భవనం గురించి నిలదీశారని అలా చేశారన్నారు. అక్కడ స్థానిక సీఐ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని మండిపడ్డారు. ఆయన్ను వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చింతల డిమాండ్ చేశారు.