: 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' రవిశంకర్ కు ఐఎస్ఐఎస్ బెదిరింపులు
భారత్ లో ప్రముఖ ఆధ్యాత్మిక గురువుగా పేరుగాంచిన శ్రీ శ్రీ రవిశంకర్ 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' సంస్థతో ఎంతో ప్రాచుర్యం పొందారు. ఈ సంస్థకు విదేశాల్లోనూ శాఖలున్నాయి. ఆ విధంగా ఆయన బోధనలకు ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది. తాజాగా ఆయనకు ఐఎస్ఐఎస్ మిలిటెంట్ గ్రూప్ నుంచి బెదిరింపులు వచ్చాయి. రవిశంకర్ ప్రస్తుతం మలేసియాలో ఉన్నారు. ఆయన బస చేసిన జెన్ హోటల్ కు ఓ కొరియర్ ద్వారా లేఖ అందింది. అందులో, రవిశంకర్ బస చేసిన హోటల్ ను ధ్వంసం చేస్తామని ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏ ఉద్దేశం కోసమైతే పర్యటిస్తున్నారో, ఆ కార్యాచరణను ఆపకపోతే చంపేస్తామని ఆ లేఖలో బెదిరించారని 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' ప్రతినిధి నకుల్ ధావన్ తెలిపారు. ఈ లేఖ విషయమై తాము భారత ఎంబసీని సంప్రదించామని చెప్పారు.