: కేజ్రీవాల్ నియంతలా వ్యవహరిస్తున్నారు: ఆప్ నేతల విమర్శలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆ పార్టీ అసమ్మతి నేతలు ప్రశాంత్ భూషణ్, యోగేంద్ర యాదవ్ బహిరంగ విమర్శలు చేశారు. ఢిల్లీలో వారు మాట్లాడుతూ, స్వరాజ్యపార్టీ అని చెప్పుకుంటున్న ఆప్ లో స్వరాజ్యం ఉందా? అని నిలదీశారు. కేజ్రీవాల్ ను ఎవరైన ప్రశ్నిస్తే సహించలేరని వారు చెప్పారు. సామాన్యుడి చేతికి అధికారం వచ్చినట్టేనని, అవినీతి అంతమవుతుందని భావించిన ప్రజలు ఎంతో నమ్మకంతో ఆప్ కి అధికారం అప్పగించారని, అలాంటి నమ్మకాన్ని నీరుగారుస్తుంటే చూస్తూ ఊరుకోమని, పార్టీని, ప్రజల నమ్మకాన్ని కాపాడేందుకు పోరాడతామని వారు చెప్పారు. కేజ్రీవాల్ ను జాతీయ కన్వీనర్ గా రాజీనామా చేయాలని తాము కోరలేదని వారు స్పష్టం చేశారు. తాము పదవి, అధికారం, సాయం కోరడం లేదని, పార్టీలో ప్రజాస్వామ్యానికి సంబంధించిన డిమాండ్లు తీర్చమంటున్నామని, వాటిని తీరిస్తే పార్టీకి రాజీనామా చేస్తామని వారు తెలిపారు.