: పదేళ్లుగా పాదరక్షలు లేకుండానే... టీఆర్ఎస్ నేత ఉద్యమ స్ఫూర్తి!


ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొనసాగిన ఉద్యమం, పలు దేశాల్లో జరిగిన ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచిందనే చెప్పాలి. టీఆర్ఎస్ నాయకత్వం వహించిన ఈ ఉద్యమంలో జనం స్వచ్ఛందంగా పాలుపంచుకున్నారు. నిరసనలను హోరెత్తించారు. సర్కారీ పాలనను స్తంభింపజేశారు. నాటి ఉద్యమంలో పాలుపంచుకున్న వారందరికీ వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాకు చెందిన మల్లికార్జున్ ఆదర్శంగా నిలుస్తున్నారు. టీఆర్ఎస్ చేపట్టిన ఉద్యమానికి ఆకర్షితులైన మల్లికార్జున్ ఆ పార్టీలో క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు. అనంతరం అణువణువూ ఉద్యమ స్ఫూర్తి నిండిన మల్లికార్జున్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యే దాకా కాళ్లకు చెప్పులే వేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా 2005, జూన్ 6న పాదరక్షలను పక్కన పెట్టేశారు. కాళ్లకు చెప్పులు లేకుండానే ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎట్టకేలకు ఆయన కల ఫలించింది. అయినా ఆయన చెప్పులేసుకోవడం లేదు. మీ కల ఫలించిందిగా, చెప్పులేసుకోమని చెబితే... ఉద్యమానికి జీవం పోసి తెలంగాణ కలను సాకారం చేసిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన తర్వాత కాని చెప్పులేసుకునేది లేదని ఆయన తేల్చిచెప్పారు. మరి కేసీఆర్, ఆయనకు అపాయింట్ మెంట్ ఎప్పుడిస్తారో చూడాలి.

  • Loading...

More Telugu News