: మీరేమీ అంపైర్లు కాదు... బ్యాంకర్లు మాత్రమే: ఎస్బీహెచ్ కు హైకోర్టు అక్షింతలు!
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ సర్కారు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు అధికారుల నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఏ చట్టం కింద ఏపీ ఖాతాలు స్తంభింపజేశారో చెప్పాలన్న హైకోర్టు, మీరేమీ అంపైర్లు కాదని తలంటింది. ఏపీ ఉన్నత విద్యా మండలి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన బ్యాంకు అధికారుల చర్యను సవాల్ చేస్తూ చంద్రబాబు సర్కారు దాఖలు చేసిన పిటిషన్ ను నిన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ సంజయ్ కుమార్ లతో కూడి డివిజన్ బెంచ్ విచారించింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నిర్ణయాలు తీసుకోవడానికి మీరేమీ అంపైర్లు కాదు. మీరు పోషించాల్సింది బ్యాంకర్ పాత్ర మాత్రమే. బ్యాంకు ఖాతాలపై ఆధిపత్యం కోసం రెండు సంస్థలు పోటీ పడితే, అందుకు సంబంధించి సివిల్ కోర్టులో సూట్ వేసి ఇంజక్షన్ ఉత్తర్వులు పొందొచ్చు. బ్యాంకు ఖాతాను స్తంభింపజేసే అధికారాలు మీకెక్కడున్నాయో చెప్పాలి’’ అంటూ ఎస్బీహెచ్ తరఫు న్యాయవాదిని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. ‘‘చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడం సరికాదు. ఈ విధంగా మీ అధికారులు నిర్ణయాలు తీసుకుంటే చిక్కుల్లో పడతారు’’ అని కూడా జస్టిస్ గుప్తా హెచ్చరించారు.