: మృగాల ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన చిన్న కారు... గంటల తరబడి ఉత్కంఠ!


హైదరాబాదులో ట్రాఫిక్ జామ్ లో చిక్కుకుంటేనే, ఎప్పుడెప్పుడు బయటపడతామా అంటూ చికాకుపడతాం. అయితే, ఇప్పుడు చెప్పుకోబోయే ‘ట్రాఫిక్ జామ్‘ గురించి వింటే బిక్కచచ్చిపోవాల్సిందే. ఎందుకంటే, ముందేమో సింహాల గుంపు. వెనకేమో భారీ గజరాజం. ముందుకెళితే నుయ్యి... వెనక్కెళితే గొయ్యి... అంటే ఇదేనేమో అనిపించకమానదు. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో 2013లో చోటుచేసుకున్న ఈ అరుదైన ‘ట్రాఫిక్ జామ్’కు సంబంధించిన ఫొటోలు తాజాగా వెలుగు చూశాయి. ముందు సింహాల గుంపు రోడ్డుపై సేదదీరుతుంటే, ముందుకెళ్లేదెలా అంటూ కారును వెనక్కు తిప్పుదామనుకునే లోపే ఓ భారీ గజరాజం అక్కడ నిలిచింది. దీంతో ముందుకు కదలలేక, వెనక్కు తిరగలేక ఆ కారులోని జంతు ప్రేమికులు క్షణమొక యుగంలా కాలం వెళ్లదీశారు. అయితే, ఇవేమీ పట్టని సింహాలు, గజరాజం కొద్దిసేపటికి తమ దారిన తాము వెళ్లిపోయాయి. గంటల తరబడి కొనసాగిన టెన్షన్ నుంచి బయటపడ్డ ఆ కారులోని వారు బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరుగులు పెట్టారు. అటుగా వచ్చిన ఓ మహిళ ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించి, తాజాగా వాటిని విడుదల చేశారు.

  • Loading...

More Telugu News