: ‘గాలి’పై సీబీఐ మరో కేసు... హెలికాప్టర్ కోసం తప్పుడు ష్యూరిటీ ఇచ్చారట!


ఓబుళాపురం అక్రమ మైనింగ్ లో ఇప్పటికే రెండేళ్లకు పైగా జైలు ఊచలు లెక్కపెట్టిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిపై సీబీఐ మరో కేసు నమోదు చేయనుంది. గతంలో అక్రమ మైనింగ్ తో సర్కారీ ఆదాయానికి గండికొట్టిన గాలి, ఈ సారి తప్పుడు ష్యూరిటీలు ఇచ్చి సీబీఐ కోర్టునే తప్పుదోవ పట్టించేందుకు యత్నించారట. వివరాల్లోకెళితే... అక్రమ మైనింగ్ కేసులో గాలిని అరెస్ట్ చేసిన సందర్భంగా ఆయన హెలికాప్టర్ సహా, పలు వస్తువులను సీబీఐ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల బెయిల్ పై విడుదలైన ఆయన సీబీఐ స్వాధీనంలోని హెలికాప్టర్ ను తమకు అప్పగించాలని ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డి పేరిట పిటిషన్ వేయించారు. వాడకుండా ఉంటే, హెలికాప్టర్ పాడవుతుందని చెప్పిన గాలి, తమకు అప్పగిస్తే వాడుకుంటామని కోర్టును కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కోర్టు... రూ.6.62 కోట్ల విలువ చేసే వ్యక్తిగత బాండ్లతో పాటు థర్డ్ పార్టీ స్థిరాస్తిని ష్యూరిటీగా ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఖమ్మం జిల్లా ఖానాపురం మండలానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందిన ఐదెకరాల భూమిని ష్యూరిటీకి సిద్ధం చేసిన గాలి, దానిని 23,200 చదరపు గజాలుగా చూపారట. అయితే గాలిపై అనుమానం వచ్చిన సీబీఐ అధికారులు, సదరు పత్రాలను పూర్తిగా పరిశీలించాలని కోర్టును కోరారు. దీంతో సదరు పత్రాల పరిశీలనకు కోర్టు అనుమతివ్వగా, రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు గాలి నయా మోసాన్ని రట్టు చేశారు. లక్ష్మణ్ అనే వ్యక్తికి చెందినదిగా గాలి పేర్కొన్న భూమిని ఎప్పుడో ప్లాట్లుగా వేసి అమ్మేశారని తేలిందట. దీంతో గాలి, పిటిషన్ దాఖలు చేసిన శ్రీనివాసరెడ్డి, భూమి యజమానిగా పేర్కొన్న లక్ష్మణ్ అనే వ్యక్తిపైనా కేసులు నమోదు చేసేందుకు సీబీఐ సన్నాహాలు చేస్తోంది.

  • Loading...

More Telugu News