: ఆ నాలుగు గంటల్లో ఏం జరిగింది?: పూజిత ఆత్మహత్యపై బంధువుల డిమాండ్
పంజాగుట్ట పరిధిలో విగతజీవిగా కనిపించిన నందిగామ అమ్మాయి పూజిత ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఉద్యోగం రాలేదన్న మనోవేదనతో పూజిత కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంది. అటు విజయవాడతో పాటు ఇటు హైదరాబాదులో తన స్నేహితుడు అక్షయ్ కుమార్ కిచ్చిన షర్ట్ లో సూసైడ్ నోట్ లను పెట్టిన పూజిత మొన్న అర్ధరాత్రి దాటిన తర్వాత 2.30 గంటల ప్రాంతంలో ఐఏఎస్ కాలనీలో ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఆమె తన ముందుభాగానికి నిప్పు పెట్టుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆత్మహత్య జరిగిన తీరుపై పూజిత బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 10.30 గంటల సమయంలో స్నేహితుడి నుంచి వీడ్కోలు తీసుకున్న పూజిత, 2.30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుందని, ఈ నాలుగు గంటల వ్యవధిలో ఏం జరిగిందో నిగ్గు తేల్చాలని పూజిత తాతయ్య వాసిరెడ్డి రామలింగయ్య డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు నిన్న రాత్రి పూజిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్ట్ మార్టం జరిగింది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించాల్సిన పోలీసులు, ఆ పని చేయలేదు. దీంతో ఘటన జరిగిన తీరుపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.