: కొడుకును ప్యూన్ ఉద్యోగానికి పంపిన ఎమ్మెల్యే
సాధారణంగా రాజకీయ నేతల కుమారులు ఎంతో దర్పం ప్రదర్శిస్తుంటారు. వారి విద్యార్హతలు ఏపాటివైనా కానీ, వారు మాత్రం ఎక్కడా తగ్గరు. ఆ నేతాశ్రీలు కూడా తమ సంతానం దర్జాగా బతకాలని ఆశిస్తుంటారు. కానీ, అలాంటి రాజకీయనేతలకు ఈ రాజస్థాన్ ఎమ్మెల్యే పూర్తి వ్యతిరేకం. వివరాల్లోకెళితే... హీరాలాల్ వర్మ ఓ బీజేపీ ఎమ్మెల్యే. ఆయన కుమారుడు హన్సరాజ్ 8వ తరగతి పాసయ్యాడు. తన స్థాయికి తగిన విధంగా కుమారుడిని కూడా పార్టీలోకి తీసుకువచ్చి ఏదైనా పదవి ఇప్పించే వీలున్నా హీరాలాల్ వర్మ అలా చేయలేదు. తనయుడి విద్యార్హతలకు తగిన ఉద్యోగంలోనే అతడిని చేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో, అజ్మీర్ లోని కృషి ఉపాజ్ మండి (రాజస్థాన్ స్టేట్ అగ్రికల్చర్ మార్కెటింగ్ బోర్డు)లో ప్యూను ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు పంపాడు. ఆ కుర్రాడు ఇతర అభ్యర్థులతో పాటే క్యూలో నిలుచుని ఉండడం మీడియా కంటబడింది. తన కొడుకు తక్కువ విద్యార్హత కలిగి ఉన్నందున, ఈ ఉద్యోగమైతే అతనికి సరిపోతుందని భావించానని రెండుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన వర్మ తెలిపారు. అతని స్థాయికి మించిన పనిచేయమని ఎలా ప్రోత్సహించగలమని ప్రశ్నించారు.