: భారత్ ను గెలిపించేందుకే ఆ 'నో బాల్' ఇచ్చారనడం తప్పు: లక్ష్మణ్
టీమిండియా-బంగ్లాదేశ్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో అంపైర్ ప్రకటించిన ఓ నో బాల్ నిర్ణయం ఇప్పుడు ఆసియా క్రికెట్ లో తీవ్ర దుమారం రేపుతోంది. భారత బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ 90 పరుగుల వద్ద ఉండగా, అవుటైనా ఆ బంతిని నో బాల్ గా ప్రకటించారంటూ బంగ్లాదేశ్ క్రికెట్ వర్గాలు మండిపడుతున్నాయి. బంగ్లా పేసర్ రూబెల్ హుస్సేన్ విసిరిన బంతిని రోహిత్ షాట్ కొట్టగా అది డీప్ మిడ్ వికెట్లో ఫీల్డర్ చేతిలో వాలింది. అయితే, రూబెల్ విసిరిన బంతి నడుము కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని, అది 'నో బాల్' అని అంపైర్లు అలీమ్ దార్, ఇయాన్ గౌల్డ్ నిర్ధారించారు. ఇప్పుడు దానిపై టీమిండియా దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ స్పందించాడు. భారత్ ను గెలిపించేందుకే అంపైర్లు ఆ బంతిని నో బాల్ గా ప్రకటించారనడం తప్పు అని పేర్కొన్నాడు. ఏ అంపైర్ కూడా కావాలని ఇలాంటి నిర్ణయాలు తీసుకోరని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఐసీసీ అధ్యక్షుడు ముస్తఫా కమల్ పాషా ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలు సబబు కాదని లక్ష్మణ్ హితవు పలికాడు.