: షారుఖ్ ఖాన్ ను వదలనంటున్న'వాంఖెడే'
ఐపీఎల్ వివాదం బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ ను ఇంకా వెంటాడుతూనే ఉంది. 2012 మే 16న ముంబయి ఇండియన్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా షారుఖ్ ముంబయి వాంఖెడే స్టేడియంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగాడు. వారిని బండబూతులు తిడుతూ నానాయాగీ చేశాడు. అప్పుడు షారుఖ్ తాగి ఉన్నాడని ముంబయి క్రికెట్ సంఘం ఆరోపించింది కూడా. అప్పట్లో దీనిపై వారు మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాజాగా, మహారాష్ట్ర బాలల హక్కుల ప్యానెల్ ఇప్పుడు షారుఖ్ పై తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. వాంఖెడే ఘటనలో షారుఖ్ పిల్లల ముందే అభ్యంతరకరమైన భాష ఉపయోగించాడని, అది పిల్లల మనసుపై ప్రభావం చూపుతుందని, బాలల గౌరవానికి భంగకరమని ప్యానెల్ పేర్కొంది. ఈ వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేయాలని పోలీసులకు స్పష్టం చేసింది.