: 'కసబ్ మటన్ బిర్యానీ డిమాండ్' వెనుక అసలు కథ ఇదే...!
ముంబయిలో దారుణ మారణహోమం సృష్టించి, చివరికి పట్టుబడ్డ పాకిస్థాన్ ఉగ్రవాది అజ్మల్ కసబ్ విషయంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. కసబ్ జైల్లో ఉన్నప్పుడు మటన్ బిర్యానీ కావాల్సిందేని డిమాండ్ చేశాడంటూ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. అయితే, దాడి కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా వ్యవహరించిన ఉజ్వల్ నికమ్ అసలు విషయం వెల్లడించారు. కసబ్ నిజంగా మటన్ బిర్యానీ కోరలేదని, తామే అలా ప్రచారం చేశామని తెలిపారు. తాము అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించారు. కేసులో విచారణ జరుగుతున్న సందర్భంగా ఓ రోజు కోర్టులో కసబ్ తల దించుకుని కన్నీళ్లు తుడుచుకోవడం కనిపించిందని, దాంతో మీడియా, కసబ్ కంట్లో కన్నీళ్లు అని న్యూస్ బ్రేక్ చేసిందని చెప్పారు. ఆ రోజున రక్షాబంధన్ పర్వదినం కావడంతో, పాక్ లో ఉన్న తన సోదరి గుర్తొచ్చి కన్నీటి పర్యంతమయ్యాడని వార్తలు రావడంతో, కసబ్ విషయంలో ఓ రకమైన భావోద్వేగపూరిత వాతావరణం ఏర్పడిందని, ఆ సమయంలో అతడిపై అందరికీ జాలి కలిగే సూచనలు కనిపించాయని ఉజ్వల్ నికమ్ తెలిపారు. ఓ దశలో అతడు అమాయకుడేమో అని కూడా కొందరు సందేహించే పరిస్థితి ఏర్పడిందని, ఇలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకే తాము కసబ్ మటన్ బిర్యానీ కావాలని జైలు అధికారులతో గొడవకు దిగుతున్నాడని ప్రచారం చేశామని ఆయన వివరించారు. దీంతో, ఆ ఉగ్రవాదిపై అందరిలోనూ మామూలు భావం ఏర్పడిందని చెప్పారు. 'అతను బిర్యానీ అడగలేదు, ప్రభుత్వం అందించనూ లేదు' అని వెల్లడించారు. కౌంటర్ టెర్రరిజంపై జైపూర్లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.