: బాబూ రుణమాఫీ అన్నరోజు ఇవన్నీ ఎందుకు చెప్పలేదు: జగన్ సూటి ప్రశ్న
రైతు రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును వైఎస్సార్సీపీ అధినేత జగన్ నిలదీశారు. లోటస్ పాండ్ లో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేస్తానని సీఎం చంద్రబాబు అబద్ధాలు చెప్పారని అన్నారు. ఎన్నికలప్పుడు రుణమాఫీపై ఆంక్షలు ఉంటాయని చెప్పారా? అని ప్రశ్నించారు. కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ వర్తిస్తుందని, అదీ ఆధార్ కార్డు ఉన్నవాళ్లకే ఇస్తామని, రేషన్ కార్డుతో ముడిపెడతామని కానీ, రుణమాఫీ ఐదేళ్లలో చెల్లిస్తామని కానీ, ఉద్యాన పంటలను రుణమాఫీ నుంచి మినహాయిస్తామని కానీ చెప్పలేదని అన్నారు. అలాగే హైదరాబాదులో ఉద్యోగం చేసుకునే వారికి రుణమాఫీ వర్తించదని చెప్పారా? అని అడిగారు. హైదరాబాదులో రేషన్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ ఉన్న చంద్రబాబు, ఎలాంటి ఆంక్షలు లేకుండా ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి కావచ్చు, అదే ఏపీకి చెందిన రైతులు ఏవైనా పత్రాలు లేకపోతే రుణమాఫీకి అనర్హులా? అని ఆయన నిలదీశారు. ఈ విషయాలను ఎన్నికలప్పుడే ఎందుకు చెప్పలేదని ఆయన నిలదీశారు. ఇప్పటికీ చంద్రబాబు రుణమాఫీపై అబద్ధాలు చెబుతున్నారని ఆయన ఆరోపించారు.