: పెళ్లి చేసుకుందామని ఆశపడితే చావు తప్పి కన్ను లొట్టబోయింది


విడాకులు తీసుకుని ఎంతకాలం ఒంటరిగా ఉంటాం...పెళ్లి చేసుకుందాం అని భావించిన ఓ రిటైర్డు ఉద్యోగికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే...తమిళనాడులోని చెన్నైకి చెందిన రిటైర్డ్ ఉద్యోగి రామ్మూర్తి భార్య నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటున్నాడు. ముదిమి వయసులో ఓ తోడు ఉంటే జీవితం సాఫీగా సాగిపోతుందని భావించి మళ్లీ పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు. దీంతో వధువు కావలెను అని ప్రకటన ఇచ్చాడు. అతని ప్రకటనకు స్పందించిన వైష్ణవి (35) అనే మహిళ, అతనిని కోయంబేడు బస్టాండ్ కు రావాలని, అక్కడ కలిశాక మిగిలిన వివరాలు మాట్లాడుకుందామని చెప్పింది. పర్లేదు మంచి స్పందనే వచ్చిందని భావించిన రామ్మూర్తి ఆశగా కోయంబేడు బస్టాండ్ కు వెళ్లాడు. వైష్ణవిని కలిసి మాటకలిపాడు. ఇంతలో ఓ నలుగురు యువకులు చుట్టుముట్టి ముష్టిఘాతాలు కురిపించి, అతనిని ఎత్తి కారులో పడేశారు. రెండు రోజులు ఆయన్ను నగరమంతా తిప్పుతూ ఓ బ్యాంక్ దగ్గరకు తీసుకెళ్లి, అతని ఖాతాలో ఉన్న 35 లక్షల రూపాయలు డ్రా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రామ్మూర్తి తెలివిగా వ్యవహరించి, తన కిడ్నాప్ విషయం బ్యాంక్ అధికారుల చెవిన వేశాడు. అప్రమత్తమైన బ్యాంకు సిబ్బంది తాంబరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేయడం గమనించిన ఆ ముఠా, వైష్ణవితోపాటు అక్కడి నుంచి ఉడాయించింది. దీంతో చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా రామ్మూర్తి పోలీసులకు వివరాలు తెలిపాడు.

  • Loading...

More Telugu News