: తీహార్ జైలులో ఉంటూ, బెదిరింపులకు పాల్పడుతున్న గ్యాంగ్ స్టర్!


దేశంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన జైలుగా పేరున్న తీహార్ జైలులో అధికారుల నిర్లక్ష్యంపై మరోసారి అనుమానాలు తలెత్తాయి. జైలులో ఉన్న ఒక గ్యాంగ్ స్టర్ మొబైల్ ఫోన్ వాడుతూ ఢిల్లీలోని ఓ వ్యాపారవేత్తకు బెదిరింపు కాల్స్ చేశాడు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీసులు కనిపెట్టి గ్యాంగ్ స్టర్ పై మరో కేసు పెట్టారు. వివరాల్లోకి వెళితే... కరుడుగట్టిన నేరగాడిగా పేరున్న నవీన్ బాలి గత రెండేళ్లుగా తీహార్ జైలులో ఉన్నాడు. జైలు బయట ఉన్న ముగ్గురి సహకారంతో జైలు నుంచి ఫోన్లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నాడు. బాలిపై 20కి పైగా హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. 98--0899-- నెంబర్ నుంచి ఆయన ఫోన్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. పక్షం రోజుల క్రితం వరకూ నిరాటంకంగా బాలి తన అనుచరులతో మాట్లాడాడని, ఇప్పుడా ఫోన్ ను సీజ్ చేశారని సమాచారం. ఢిల్లీలోని రోహిణీ ప్రాంతానికి చెందిన వ్యాపారి లలిత్ మాథుర్ కు ఫోన్ చేసి రూ. 50 లక్షలు డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అనూప్ సింగ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి ప్రహ్లాద్ పూర్ లో అతనున్న ప్లాట్ ను ఖాళీ చేయాలనీ బెదిరించాడు. వాస్తవానికి తీహార్ జైలులో 35 నుంచి 40 సిగ్నల్ జామర్లు ఉంటాయి. 3జి సిగ్నల్స్ సైతం రావు. ఈ పరిస్థితిలో బాలి ఉదంతం వెలుగు చూడడం భద్రతా లోపాలను ఎత్తిచూపుతోంది. ఈ కేసులో విశాల్ మాన్ అనే పేరున్న వ్యక్తిని, ఇద్దరు షూటర్లు, నేపాల్ కు చెందిన సంతోష్ బహదూర్, ఘజియాబాద్ కు చెందిన నిజాంలను అరెస్ట్ చేశామని, జైలులో మరింత పకడ్బందీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలని చెప్పినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News