: బండెనక బండి 'కొట్టె'... వేగంగా వచ్చి ఢీకొట్టుకున్న నాలుగు కార్లు... మాదాపూర్ లో ట్రాఫిక్ జాం!
అది మాదాపూర్ పరిధిలోని అయ్యప్ప సొసైటీకి దారి తీసే రోడ్డు. గుంతలు లేని ఆ రోడ్డుపై వాహనాలు వేగంగా దూసుకెళతాయి. నేటి ఉదయం కూడా స్పీడ్ గా వాహనాలు దూసుకెళుతున్నాయి. ఉన్నట్టుండి, ఓ కారు వేగం తగ్గింది. అంతే, ఆ కారును వెనకగా వచ్చిన కారు ఢీ కొట్టింది... దానిని మరొకటి ... దానిని ఇంకొకటి ... ఇలా వరుసగా నాలుగు కార్లు ఢీ కొట్టుకున్నాయి. ఒకదానితో ఒకటి వెనుక భాగాలను ఢీకొట్టుకుంటూ నిలిచిపోయిన సదరు వాహనాల ముందు భాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామయ్యింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో ఓ మోటార్ సైకిలిస్ట్ గాయపడ్డాడు. అసలు ఆ కారెందుకు స్పీడ్ తగ్గించిందో తెలుసా? అంతకు కాసేపటి ముందు ఓ కారు, టిప్పర్ ఢీకొన్నాయి. దానిని చూసేందుకు సదరు కారు డ్రైవర్ తన కారును స్లో చేశాడు, ఈ ప్రమాదానికి కారణమయ్యాడు.