: ముషారఫ్ కు జ్యుడీషియల్ కస్టడీ
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు ఇస్లామాబాద్ తీవ్రవాద వ్యతిరేక న్యాయస్థానం మే 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. నిన్న ఆయనకు కోర్టు రెండు రోజుల ట్రాన్సిట్ రిమాండ్ విధించగా, అందులో భాగంగా నిన్నటి రోజల్లా ఆయనను పోలీసు కస్టడీలో ఉంచారు. ఒక రోజు ముందుగానే, ఈరోజు పోలీసులు ఆయనను కోర్టు ఎదుట ప్రవేశపెట్టారు. దాంతో మే 4 వరకు జుడీషియల్ కస్టడీ విధిస్తూ, తిరిగి అదే తేదీన తమ ఎదుట ప్రవేశపెట్టాలని న్యాయస్థానం ఆదేశించింది.
అంతకు ముందు కోర్టులో జరిగిన వాదనల సమయంలో ముషారఫ్ న్యాయవాది ఖమర్ అఫ్జల్ వాదిస్తూ... విచారణ సమయంలో ముషారఫ్ పోలీసులకు పూర్తిగా సహకరించారనీ,అందువల్ల మళ్ళీ పోలీసు కష్టడీకి ఇవ్వకుండా జుడీషియల్ కష్టడీకి ఇవ్వాలనీ విజ్ఞప్తి చేశారు. కాగా, బెయిల్ విషయంలో త్వరలో సుప్రీంను ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. పదవిలో ఉన్న 60 మంది న్యాయమూర్తులను నిర్భందించిన కేసులో, న్యాయమూర్తి ఆదేశంపై పోలీసులు ఈ మాజీ అధ్యక్షుడిని ఫాంహౌజ్ లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.