: బొమ్మలో బాంబు... ఇద్దరు చిన్నారులు, తండ్రి మృతి
ఇంటి బయట కనిపించిన బొమ్మను ఆడుకునేందుకు తేవడం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. బొమ్మలో అమర్చిన బాంబు పేలడంతో ఇద్దరు చిన్నారులతో పాటు వారి తండ్రి కూడా మరణించాడు. ఈ దుర్ఘటన పాకిస్థాన్ లోని స్వాత్ జిల్లా బాషిగ్రామ్ ప్రాంతంలో నేడు జరిగింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించగా, వీరి పరిస్థితి విషమంగా వున్నట్టు డాక్టర్లు తెలిపారు. ఇంటి బయట ఆడుకుంటున్న పిల్లలు పక్కనే కనిపించిన బొమ్మను చూసి ముచ్చటపడి ఇంట్లోకి తీసుకువచ్చి ఆటలు ఆడుతుండగా, బొమ్మ పేలిందని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.