: మనోడే... మద్యం షాపు తెరిపించండి... టీ-మంత్రి పద్మారావుకు విప్ సునీత సిఫారసు: పీడీ యాక్టు కింద కేసుపెడతానన్న మంత్రి!
మనోడే కదా అనుకుంటూ, ఓ మద్యం వ్యాపారిని కష్టాల నుంచి గట్టెక్కిద్దామని ప్రయత్నించిన తెలంగాణ ప్రభుత్వ విప్ గొంగడి సునీతారెడ్డి కొంత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. విషయం ఏమంటే... ఇటీవల నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు మద్యం షాపులపై దాడులు చేసి సుంకాలు చెల్లించని మద్యాన్ని స్వాధీనం చేసుకొని, వైన్ షాప్ యజమానులపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో ఓ మద్యం దుకాణాన్ని కూడా సీజ్ చేశారు. సదరు వ్యాపారి ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికి తెలిసిన వ్యక్తి. ఆయనను తీసుకొని ఆమె అసెంబ్లీకి వచ్చి ఎక్సైజ్ మంత్రి పద్మారావును కలిశారట. "అన్నా, ఇతను మా దగ్గరే మద్యం దుకాణం నడుపుతున్నాడు. ఆయనపై కేసు పెట్టి, దుకాణం మూసివేయించారు. మన పార్టీకి బాగా కావాల్సిన వాడు. ఎన్నికల సమయంలో ఎంతో సాయపడ్డాడు. వెంటనే కేసు ఎత్తివేయించి, షాపును తెరిపించండి" అని కోరారట. దీంతో, ఆమె ముందే వ్యాపారితో మాట్లాడుతూ, 'సుంకం చెల్లించకుండా మద్యం అమ్ముతున్నందుకు నీ పై కేసు పెట్టడం కరెక్టే' అంటూ, 'ఎక్కువ తక్కువ చేస్తే పీడీ యాక్ట్ కింద బుక్ చేయిస్తా' అని హెచ్చరించారట.