: బంగారు తెలంగాణకు తొలి ఎదురు దెబ్బ... సిర్పూర్ పేపర్ మిల్లును మూసేసిన బిర్లాలు
బంగారు తెలంగాణకు ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే కొత్తగా ఏర్పాటు కానున్న పలు పరిశ్రమలను కోల్పోయిన కొత్త రాష్ట్రంలో వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న భారీ పరిశ్రమ మూతపడింది. భారత పారిశ్రామిక రంగ దిగ్గజాలుగా వెలుగొందుతున్న బిర్లాలు తెలంగాణ ప్రజలను నిండా ముంచగా, కొత్త రాష్ట్రంలో తొలి పాలనను చేజిక్కించుకుని రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుతామని బీరాలు పలికిన టీఆర్ఎస్ ప్రభుత్వం చోద్యం చూసింది. వివరాల్లోకెళితే... ఆదిలాబాదు జిల్లా కాగజ్ నగర్ లోని సిర్పూర్ పేపర్ మిల్లును బిర్లా యాజమాన్యం మూసేసింది. భారీ నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీని ఖాయిలా పరిశ్రమగా ప్రకటించాలని కోరుతూ బిర్లా యాజమాన్యం బీఆర్ జీఎఫ్ కు దరఖాస్తు చేసింది. బిర్లా యాజమాన్యం నిర్ణయంతో 3,650 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. అంతేకాక కంపెనీపై పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న 15 వేల మంది ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గత కొన్ని రోజులుగా మిల్లు మూత దిశగా యాజమాన్యం చేపట్టిన చర్యలతో కార్మికులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఓ కార్మికుడు ఆత్మహత్య చేసుకోగా, నలుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. ఇదిలా ఉంటే, ఈ మిల్లు గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షుడిగా తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి కొనసాగుతున్నారు. కష్టాల్లో ఉన్న మిల్లును కాపాడి కార్మికుల జీవనోపాధికి భరోసాగా నిలుస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్, మిల్లును మూసివేస్తూ బిర్లాలు తీసుకున్న నిర్ణయంపై స్పందించకపోవడం గమనార్హం.