: చేతికి చిక్కిన పోలీసును ప్రాణాలతో వదిలేసిన మావోయిస్టులు... ఇదే తొలిసారట!
మావోయిస్టులు, పోలీసుల మధ్య పచ్చగడ్డి కూడా భగ్గుమంటుంది అనే సంగతి తెలిసిందే. ఎవరు ఎవరికి చిక్కినా ప్రాణాలపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. అటువంటిది ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ఛత్తీస్ గఢ్ లో తమకు చిక్కిన ఒక ఏఎస్ఐని మావోయిస్టులు చితకబాది వదిలిపెట్టిన ఘటన సోమవారం జరిగింది. మావోయిస్టులు చేతికి చిక్కిన పోలీసును చంపేయకుండా కొట్టి వదిలేయడం ఇదే ప్రథమమని తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం ఛత్తీస్ గఢ్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. సుక్మా జిల్లా పోలంపల్లి ఏఎస్ఐ దేవాంగి, మరో కానిస్టేబుల్ తో కలిసి బైక్ పై గోరుగూడ వైపు వెళ్తుండగా వారిని మావోయిస్టులు అటకాయించారు. వారిని చూడగానే వెనుక కూర్చున్న కానిస్టేబుల్ పారిపోగా, ఏఎస్ఐ మాత్రం దొరికిపోయాడు. అతణ్ణి మావోయిస్టులు విపరీతంగా కొట్టి వెళ్లిపోయారు. ప్రస్తుతం అతడి ప్రాణాలకు ప్రమాదం లేదని పోలీసులు తెలిపారు.