: జూబ్లీహిల్స్ లో భారీ చోరీ... వ్యాపారి ఇంట్లో 2 కేజీల బంగారం అపహరణ
హైదరాబాదు, జూబ్లీహిల్స్ లో చోరీల పరంపర కొనసాగుతోంది. ఇటీవల జూబ్లీహిల్స్ పరిధిలోని సినీ ప్రముఖుల ఇళ్లల్లోకి చొరబడుతున్న దొంగలు విలువైన వస్తువులను తస్కరిస్తున్నారు. గతవారం ఏకంగా రామానాయుడు స్టూడియోలోనూ దొంగలు స్వైరవిహారం చేశారు. లక్షల విలువ చేసే ఎల్ఈడీ లైట్లను ఎత్తుకెళ్లిన చోరులను ఆ తర్వాత పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా గడచిన రాత్రి జూబ్లీహిల్స్ పరిధిలోని వ్యాపారి సుధీర్ ఇంటిలో చోరీ జరిగింది. సుధీర్ ఇంటిలోకి చొరబడ్డ దొంగలు, 2 కేజీల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. చోరీ విషయం తెలుసుకున్న సుధీర్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు చోరుల కోసం గాలింపు చేపట్టారు.