: 20 ఏళ్ల తరువాత చలామణిలోకి వచ్చిన రూపాయి నోటు
దాదాపు 20 సంవత్సరాల తరువాత ఒక రూపాయి నోట్లు ఇండియాలో చలామణిలోకి వచ్చాయి. కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్రిషి సంతకంతో కూడిన ఈ నోట్లను రాజస్థాన్లోని నద్వారా గ్రామంలోని శ్రీనాథ్ జీ దేవాలయంలో ఇటీవల వీటిని విడుదల చేశారు. కాగా, రూపాయి నోటు మినహా మిగతా అన్ని భారత కరెన్సీ నోట్లపై ఆర్ బీఐ గవర్నర్ సంతకం ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఈ కొత్తగా విడుదలైన రూపాయి నోట్లతో పాటు ఇప్పటికే మార్కెట్లో ఉన్న అన్ని 1 రూపాయి నోట్లు చెల్లుబాటు అవుతాయని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కొత్త నోట్లు 110 మైక్రానుల మందంతో ఉంటాయి. వీటిని పూర్తిగా పత్తి నుంచి తయారుచేసిన కాగితంతో చేశారు. 'సత్యమేవ జయతే' అనే అక్షరాలూ లేకుండా ఉండే అశోక స్తంభం గుర్తు ఉంటుంది. పింక్, గ్రీన్ రంగుల కలయికతో, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మెహ్రిషి సంతకంతో ఉంటుంది. 1994లో రూపాయి నోట్ల తయారీని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆపై 2, 5 రూపాయల నోట్ల ముద్రణను 1995లో నిలిపివేశారు.