: మానవత్వం లేదు... ఫొటోలు తీసుకుని వెళ్లిపోయారు!


కొన్ని సందర్భాల్లో మానవత్వం అడుగంటిపోతోంది. సాటి మనిషి కష్టాల్లో ఉంటే మనకెందుకులే అనుకునే తత్వం మనుషుల్లో ప్రబలుతోంది. తాజాగా, కోల్ కతాలో జరిగిన ఓ ఘటనే అందుకు నిదర్శనం. అఫ్సా ఖాతూన్ అనే మహిళ పిల్లలను పాఠశాలలో వదిలిపెట్టి ఇంటికి వస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైంది. ఓ బస్సు వేగంగా వచ్చి అఫ్సాను ఢీకొట్టింది. దీంతో, ఆమె తీవ్రగాయాలపాలైంది. రక్తం మడుగు కట్టింది. అయితే, ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాల్సింది పోయి, కొందరు ఆమె ఫొటోలు తీసుకుని తమదారిన తాము వెళ్లిపోయారు. ఈ విషయం అఫ్సా పొరుగువారికి తెలియడంతో వారు వచ్చి ఆమెను చిత్తరంజన్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చాలా రక్తంపోయింది. వైద్యులకు తన భర్త పేరు, ఫోన్ నెంబర్ ను చెప్పిన అఫ్సా, ఆ వెంటనే స్పృహ కోల్పోయింది. కాసేపటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు ప్రకటించారు. విషయం తెలిసిన అఫ్సా భర్త సిద్ధిఖీ తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. కాగా, ఆమె రోడ్డుపై పడి ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అఫ్సా చిన్న కూతురికి మూడు నెలల వయసేనట. ఇప్పుడా పాపను ఎవరు సముదాయించాలంటూ సిద్ధిఖీ భోరున విలపిస్తున్నాడు.

  • Loading...

More Telugu News