: ఆగ్రాలో దిమాపూర్ తరహా ఘటన... అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని వ్యక్తిని చితక్కొట్టి చంపిన ప్రజలు
అమ్మాయిలతో అసభ్యకరంగా ప్రవర్తించే వ్యక్తులను ఇప్పుడు ప్రజలు ఉపేక్షించడంలేదు. ఉతికి ఆరేస్తున్నారు. ఈ ఘటనల్లో కొన్నిసార్లు నిందితుల ప్రాణాలు కూడా పోతున్నాయి. మొన్నటికి మొన్న దిమాపూర్ లో జరిగిన ఘటనను మరువక ముందే, ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో మందుకొట్టి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తిని జనం చితక్కొట్టి చంపేశారు. అతడి ఇంటిపై దాడి చేసి, బయటకు లాక్కొచ్చి చావబాదారు. తీవ్రగాయాల పాలైన అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్లగా, అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. బాధితుడి పేరు జీతు అని తెలిసింది. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేకుండా అతడిని కర్రలతో కొట్టారని, కోపంతో ఉన్న ప్రజలను ఎవరూ ఆపలేకపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.