: 1999 తరువాత యూఎస్, క్యూబా మధ్య డైరెక్టు ఫోన్ లింక్
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, క్యూబా దేశాల మధ్య డైరెక్ట్ ఫోన్ లింక్ ను పునురుద్ధరించారు. ప్రచ్ఛన్న యుద్ధం తర్వాత ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో అంతర్జాతీయ సమాజంలో వస్తున్న మార్పులను డేగ కళ్లతో గమనిస్తున్న అగ్రరాజ్యం, పక్కలో బల్లాన్ని పెట్టుకుని మనుగడ సాగించడం ప్రమాదమని గుర్తించింది. దీంతో క్యూబా అధ్యక్షుడు రౌల్ క్యాస్ట్రోతో అమెరికా అధ్యక్షుడు ఒబామా ఫోన్ లో మాట్లాడారు. దీంతో, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రౌల్ క్యాస్ట్రో ఓ ప్రకటన చేశారు. తాజాగా రెండు దేశాల మధ్య డైరెక్టు టెలిఫోన్ సౌకర్యం పునరుద్ధరించారు. క్యూబా ప్రజలకు అమెరికా ప్రజలతో నేరుగా సంభాషించే సౌకర్యం కలుగజేస్తున్నామని క్యూబా టెలికాం సంస్థ ప్రకటించింది. దీంతో 1999 తరువాత తొలిసారిగా రెండు దేశాలకు డైరెక్టు టెలిఫోన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది.