: 'నిర్భయ డాక్యుమెంటరీ'పై నిషేధం ఎత్తివేసేందుకు కోర్టు నిరాకరణ
'ఇండియాస్ డాటర్' పేరిట ఓ బ్రిటీష్ దర్శకురాలు రూపొందించిన నిర్భయ డాక్యుమెంటరీపై భారత్ లో విధించిన నిషేధాన్ని ఎత్తివేసేందుకు ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు దాఖలు చేసిన పిల్ ను జస్టిస్ బీడీ అహ్మద్, జస్టిస్ సంజీవ్ సచ్ దేవ్ ల నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది. అంతేగాక, ఈ విషయంలో మధ్యంతర స్టే జారీ చేసేందుకు నిరాకరించింది. ఈ కేసు ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ రోస్టర్ బెంచ్ ముందుకు వచ్చినప్పుడు తెలపాలని సూచించింది. డాక్యుమెంటరీని ప్రసారం చేయడానికి ఎలాంటి సమస్యలేదని, కానీ సుప్రీంకోర్టు ముందు ఈ కేసు ఉన్నందున వీలుకాదని, ముందు ఈ విషయం చీఫ్ జస్టిస్ ముందుకు వస్తే వారే నిర్ణయం తీసుకుంటారని ఇద్దరు సభ్యుల ధర్మాసనం పేర్కొంది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది.