: ఏపీ విద్యార్థులకు తెలంగాణ బోర్డు హాల్ టికెట్లు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో కొందరు విద్యార్థులకు తెలంగాణ బోర్డు తరపున హాల్ టికెట్లు వచ్చాయి. దీంతో వారు లబోదిబోమంటున్నారు. ఎందుకంటే, మార్కుల జాబితాలు, ఇతర సర్టిఫికెట్లు కూడా తెలంగాణ బోర్డు నుంచే వస్తే వారు ఏపీలో ఉన్నత చదువులు చదివేందుకు, ఉద్యోగాలు పొందడానికి అనేక చిక్కులు ఎదురవుతాయి. ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి సూరిపోగు రాజ్ కుమార్ అనే విద్యార్థి తనకు తెలంగాణ బోర్డు నుంచి వచ్చిన హాల్ టికెట్టును మీడియాకు చూపాడు. భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయేమోనని ఆ విద్యార్థి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై, ఇంటర్మీడియట్ రీజనల్ బోర్డు అధికారి రమేశ్ మాట్లాడుతూ, హైదరాబాదులో రెండు రాష్ట్రాల బోర్డులకు ఒకటే ప్రింటింగ్ ప్రెస్ ఉందని, అందువల్లే ఇలాంటి పొరపాటు చోటుచేసుకుని ఉండవచ్చని పేర్కొన్నారు. ఆందోళన అవసరంలేదని, ఇలాంటి హాల్ టికెట్లు వచ్చిన విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తామని స్పష్టం చేశారు.