: అమ్మకానికి ఇల్లు... కొన్నవారికి ఉచితంగా ఓ భార్య కూడా!
ప్రస్తుతకాలంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కొత్తరకం వాణిజ్య ప్రకటనలు పుట్టుకొస్తున్నాయి. ఇదికొంటే అది ఉచితం, అవిస్తాం, ఇవిస్తామని చెబుతుంటారు. వాటిని మించిన రీతిలో, ఇండోనేషియాలో ఓ ఇంటి అమ్మకానికి ఇచ్చిన ప్రకటన ఆన్ లైన్ లో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. కారణం, ఇల్లు కొన్నవారికి ఓ భార్య కూడా ఉచితంగా లభిస్తుందని చెప్పడమే. వివరాల్లోకి వెళితే 'రెండు బెడ్ రూమ్ లు, రెండు బాత్ రూమ్ లు, పార్కింగ్ కు ఖాళీ స్థలం, ఓ ఫిష్ ఫాండ్ ఉన్న భవంతి అమ్మకానికి కలదు' అని ఇంటర్నెట్ లో పెట్టిన ప్రకటనలో ఉంది. ఈ ఆస్తి కొనుగోలుదారులకు ప్రకటనలో మరో అరుదైన ప్రతిపాదన కూడా చేర్చారు. అదేంటంటే... "మీరు ఈ ఇల్లు కొన్నప్పుడు... మిమ్మల్ని పెళ్లి చేసుకోవచ్చా? అని యజమానిని (మహిళ, ఇద్దరు పిల్లలున్నారు) అడగవచ్చు" అని ఉంది. ప్రకటనలో ఆ పక్కనే 40 ఏళ్ల వితంతువైన విన్ లియా, ఓ బ్యూటీ సెలూన్ కు ఓనర్ అయిన ఆమె కారు పక్కన నుంచొని ఉన్న ఫోటో ఉంటుంది. నిబంధనలు, షరతులు వర్తిస్తాయని ఉంటుంది. ఆ ఇల్లు జావా ద్వీపంలోని స్లెమన్ లో ఉండగా, ఇల్లు మార్కెట్ 75,000 డాలర్లు (రూ.47 లక్షలు). ఈ వార్త ఇంటర్నెట్ లో చాలా వేగంగా వ్యాపించింది. స్పందించిన ఇండోనేషియా కాస్కస్ అనే ప్రముఖ ఆన్ లైన్ ఫోరం యూజర్ బోల్డీస్99, "చాలా తెలివైన నిర్ణయం... ఇంటితో పాటు యజమాని కూడా అమ్ముడుబోతే, ఇంటికి ఓనర్ గా ఆమే ఉంటుంది కదా!" అని వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై వితంతువు విన్ లియాను సంప్రదించగా, తన ప్రకటన విషయంలో మీడియా స్పందనకు దిగ్భ్రాంతికి గురయ్యానని, అయితే, తనను ఇంటర్వ్యూ చేసేందుకు జర్నలిస్టులు రావడంతో ఆనందించానని చెప్పింది. ఇది తెలుసుకుని పోలీసులు వచ్చి అసలు విషయం గురించి ప్రశ్నించారని తెలిపింది. కానీ, అది తన ఆలోచన కాదని, తన ఇల్లు అమ్మాలనుకుని ఇల్లు కొనేవారిని చూసిపెట్టమని ఫ్రెండైన ఓ ప్రాపర్టీ ఏజెంట్ కు చెప్పానంది. ఈ క్రమంలో ఇల్లు కొనాలనుకునే వ్యక్తి సింగిల్ అయి ఉండాలని, అదే సమయంలో భార్య కోసం వెతికే వ్యక్తే అయితే బాగుంటుందని చెప్పానని, అది కూడా అతికొద్దిమందికే ఈ విషయం చెప్పమన్నానని, నెట్ లో పెట్టమని చెప్పలేదని విన్ లియా వివరించింది. కాగా, ఇప్పటివరకు ఈ ప్రకటనకు ఒకే ఒక్క వ్యక్తి స్పందించినట్టు, ఇల్లును చూశాడని తెలిసింది. మిగతా వివరాలు వెల్లడికాలేదు.