: చట్టాలున్నాయి... ఆ ఘటనపై నివేదిక ఇవ్వండి: రాజ్ నాథ్ సింగ్
నాగాలాండ్ లోని దిమాపూర్ లో అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని జైలు గోడలు బద్దలు కొట్టి బయటకు ఈడ్చుకువచ్చి హతమార్చిన ఘటనపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని నాగాలాండ్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. చట్టాలు పనిచేస్తున్నాయని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆయన సూచించారు. దీనిపై నాగాలాండ్ ముఖ్యమంత్రి టీఆర్ జెలియాంగ్ స్పందిస్తూ, ఈ ఘటనపై కమిటీ వేసి పూర్తిస్థాయి విచారణ జరిపి కేంద్రానికి సమగ్ర నివేదిక అందజేస్తామని అన్నారు. వీడియో ఫుటేజ్ ను పరిశీలిస్తున్నామని, మూకుమ్మడి హత్యను క్షమించేది లేదని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.