: అంతా హోలీ చేసుకుంటే అక్కడ మాత్రం పురుషులకు బడిత పూజ!
దేశం మొత్తం హోలీ సంబరాలు అంబరాన్నంటితే, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం సామ్యా తండాలో మాత్రం సంప్రదాయ డూండ్ వేడుక జరిగింది. డూండ్ అంటే... గతేడాది హోలీ నుంచి ఈ హోలీ మధ్య కాలంలో తండాలో ఎవరింటనైనా జన్మించిన మగబిడ్డను తెల్లవారుజాము నాలుగు గంటలకు మహిళలు (గెరినీలు) దాచి పెడతారు. వాడిని కర్రలు చేతబట్టిన పురుషులు (గేర్యాలు) వెతుకుతారు. ఈ వెదుకులాటను 'డూండ్' అంటారు. పిల్లాడు దొరికిన తరువాత మహిళలు, పురుషులు కలిసి కామదహనం చేసి రంగులు పూసుకుంటారు. అనంతరం, తండాలోని అంతా కలిసి పిండివంటలు చేసుకుని వాటిని పిల్లాడి ఇంటివద్దనున్న స్థూపం వద్ద గంగాళాల్లో పెడతారు. ఆ గంగాళాలను తాడుతో కట్టేసి కర్రలు చేబూని మహిళలు వాటికి కాపలా ఉంటారు. అప్పుడు పురుషులు వాటిని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేయాలి. అలా చేసినప్పుడు పురుషుల ఒళ్లు వాయగొడతారు భార్యలు. ఎవరైతే తినుబండారాల గంగాళాలను ఎత్తుకెళతారో అతనిని తండా ధీరుడిగా గుర్తిస్తారు. కామదహనం చేసిన ప్రాంతంలో ఆ తినుబండారాలను పంచుకుని తిని వెళ్లడంతో పండగ ముగుస్తుంది.