: పవన్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖ అధ్యక్షుడి మండిపాటు
ఈ రోజు మీడియా సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తమ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపైనా, దివంగత వైఎస్ పైనా చేసిన వ్యాఖ్యలను విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఖండించారు. రాజధాని ప్రాంతంలో పవన్ మాట్లాడిన మాటలకు, నేటి మీడియా సమావేశంలో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేదన్నారు. పర్యటనలో టీడీపీ మంత్రులను తిట్టిన పవన్... హైదరాబాదు వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పై విమర్శలు చేశారని అన్నారు. ఈ విమర్శలు చేయడానికి ఆయన ఎంత ప్యాకేజీకి అమ్ముడు పోయారని అమర్ నాథ్ ప్రశ్నించారు. తెరవెనుక సీఎం చంద్రబాబు డైలాగులు రాస్తుంటే తెరముందు వాటిని పవన్ చెబుతున్నారని విమర్శించారు. కాబట్టి జనసేన పార్టీని ధనసేన అని మార్చుకోవాలని సూచించారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ఇప్పటివరకు ఎన్ని ప్రశ్నలు వేశారో చెప్పాలని మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు.