: అది కూడా దేశభక్తిలో భాగమే: మోదీ
విద్యుత్ ఆదా చేయడం కూడా దేశభక్తిలో ఓ భాగమని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లోని ఖాండ్వాలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ బొగ్గు గనులను చీటీల ఆధారంగా కేటాయించిందని అన్నారు. ఢిల్లీలోని ఓ ఇంటి నుంచి సందేశం వెళ్తే, మరో ఇంటి నుంచి చీటీ వెళ్లేదని, దాని ఆధారంగా బొగ్గుగనులను కేటాయించారని ఆయన మండిపడ్డారు. 204 బొగ్గు క్షేత్రాలను చీటీ ఆధారంగా కేటాయించారని, వాటిపై సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందని ఆయన గుర్తు చేశారు. వాటన్నింటినీ వేలం ద్వారా కేటాయించాలని వంద రోజుల్లోనే ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ప్రధానిగా కాదు దేశ ఖజానాకు సంరక్షకుడిగా పని చేస్తానని చెప్పిన హామీకి కట్టుబడి పని చేస్తున్నానని మోదీ తెలిపారు. రాజ్యసభలో సంఖ్యాబలం ఉందని ప్రగతి రథాన్ని అడ్డుకోవద్దని మోదీ విపక్షాలకు విజ్ఞప్తి చేశారు.