: రాజధానిని 5 వేల ఎకరాల్లో కట్టొచ్చు... 50 వేల ఎకరాల్లోనూ కట్టొచ్చు: ఏపీ సీఎం చంద్రబాబు
నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తన వాదనను మరోమారు బలంగా వినిపించారు. నేటి ఉదయం తుళ్లూరు పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కల్యాణ్, అక్కడి రైతులతో భేటీ సందర్భంగా, తక్షణమే భూ సమీకరణను నిలిపేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక ఈ విషయంపై సర్కారుతో మాట్లాడతానని చెప్పిన పవన్, అవసరమైతే సర్కారుకు వ్యతిరేకంగా దీక్షకు దిగేందుకూ వెనుకాడబోనని ప్రకటించారు. పవన్ ప్రసంగం ముగిసిన కొద్దసేపటికే హైదరాబాదులో చంద్రబాబు స్పందించారు. అయితే పవన్ వ్యాఖ్యలను ఎక్కడా ప్రస్తావించని ఆయన తన ప్రభుత్వ ఉద్దేశాన్ని సుస్పష్టం చేశారు. జపాన్ ప్రతినిధి బృందంతో సమావేశమైన సందర్భంగా మాట్లాడిన ఆయన ‘‘నవ్యాంధ్ర రాజధానిని 5 వేల ఎకరాల్లో కట్టొచ్చు, 50 వేల ఎకరాల్లోనూ కట్టొచ్చు’’ అని వ్యాఖ్యానించారు. రాజధాని నగరం అంటే కేవలం ప్రభుత్వ కార్యాలయాలే కాదని కూడా చంద్రబాబు అన్నారు. రాజధాని నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చదిద్దేందుకు తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకెళుతోందని ప్రకటించారు. రాజధాని వల్ల తుళ్లూరు రైతులకు మేలు జరుగుతుందన్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులు స్వచ్ఛందంగానే ముందుకొచ్చారని ఆయన పేర్కొన్నారు.