: నటి దీపికా పదుకొనె అరెస్టుపై కోర్టు స్టే
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె అరెస్టుపై బాంబే హైకోర్టు ఈ నెల 16 వరకు స్టే విధించింది. నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ లో నిర్వహించిన 'ఏఐబీ' (ఆల్ ఇండియా బ్యాక్ హొడ్స్) రోస్ట్ కార్యక్రమంలో పాల్గొన్న కారణంగా దీపికకు అరెస్టు వారెంట్ జారీ అయింది. అయితే ఆ ప్రదర్శనలో తాను కేవలం ప్రేక్షకురాలినేనని, నటించడంగానీ, ప్రదర్శన చేయడంగానీ జరగలేదని తాను దాఖలు చేసిన పిటిషన్ లో దీపు పేర్కొంది. మరోవైపు తనపై పూణె, ముంబయి తార్డొ పోలీసు స్టేషన్ లలో నమోదైన ఎఫ్ఐఆర్ లను కొట్టివేయాలని రెండు పిటిషన్ లు దాఖలు చేసింది. డిసెంబర్ 20, 2014లో జరిగిన ఏఐబీ రోస్ట్ కార్యక్రమంలో రణ్ వీర్ సింగ్, అర్జున్ కపూర్, కరణ్ జోహార్ పాల్గొన్నారు. అక్కడ దీపికా, అలియా భట్, సోనాక్షి సిన్హాలు ప్రేక్షకులుగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఒక్క సోనాక్షి తప్ప అందరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ముందుగానే తాను అరెస్టవకుండా దీపికా కోర్టుకు వెళ్లింది.